ఆయుధం న్యూస్ వర్ధన్నపేట:ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగం, గ్రామ పరిశుభ్రత, మహిళల ఆరోగ్యం, బాలికల విద్య, పంట మార్పిడి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రుతుపవనాల రాక ఆలస్యం కావచ్చనే అంచనాల నేపథ్యంలో రైతులు పంట మార్పిడికి సహకరించాలని కోరారు.వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ, గతంలో రైతులు అనుసరించిన సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించాలని సూచించారు.
తక్కువ నీటితో సాగు చేయగల జొన్నలు, మినుములు, పత్తి, ఆయిల్ పామ్ వంటి పంటలను సాగు చేయాలని తెలిపారు.పంట అవశేషాలను కాల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండటంతో పాటు నేల సారవంతతకు ఉపయోగపడే సూక్ష్మజీవులు నశిస్తాయని చెప్పారు. అలాంటి చర్యలకు పాల్పడితే జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.అధిక రసాయనాలు కలిగిన ఎరువులను ఇళ్లలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచరాదని, వాటి నుంచి వెలువడే రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని తెలిపారు.ఎరువులు వినియోగించే సమయంలో మాస్క్, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చిన కలెక్టర్, ప్లాస్టిక్ వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందన్నారు.భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.తడి, పొడి చెత్తతో పాటు బయోవేస్ట్, శానిటరీ వేస్ట్‌ను వేర్వేరుగా సేకరించడం ద్వారా రీసైక్లింగ్‌కు అవకాశం కలుగుతుందని, గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపడుతుందని తెలిపారు.వర్షాకాలంలో దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా నిరోధించి డయేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని చెప్పారు.
మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత సమాజ అభివృద్ధికి కీలకమని పేర్కొంటూ పర్యావరణహిత సానిటరీ ప్యాడ్స్ వినియోగించాలని సూచించారు. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా సమాజ పురోగతికి దోహదపడాలని అన్నారు.గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో బాలికలు అత్యధికంగా 500కు పైగా మార్కులు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ గ్రామ సభ లో గ్రామ సర్పంచ్ దశరథం, జడ్పి సీఈఓ రామ్ రెడ్డి, తహశీల్ధార్ విజయ్ సాగర్,ఎంపిడిఓ వెంకటరమణ. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
