ePaper
Sunday, June 21, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండఅరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హన్మకొండ:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డి.ఎన్.డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితం అయిన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతోపాటు భగవంతుని తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా  పవన్ కళ్యాణ్ ని కలవాలని అభిలషించారు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు? అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని భగవంతుడి ఆశీస్సులు బాబుకి ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం నింపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం  లక్ష రూపాయలఆర్ధిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం
నిరంజన్ ను చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్  ఆతనితో చాలా సమయం గడిపారు. ఇంట్లోకి వచ్చిన  పవన్ కళ్యాణ్  లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. ‘చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం’ అని నిరంజన్ చెప్పిన మాటలు విని కదలిపోయారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ఆలయంలో పూజ చేయించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు.నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో  పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ చేసిన డాన్సుల తాలూకు వీడియోలు, ఫొటోలను  తిలకించారు. అంతా తనని చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు.


కుటుంబ జీవనోపాధికి క్యాంటీన్*
ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా ఆ ఇంటి ఓనర్స్ ని పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్లో పని చేసేవారమని చెప్పగా, వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశం చేశారు.నిరంజన్ పరామర్శ పూర్తయిన వెంటనే  పవన్ కళ్యాణ్  నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్  శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ఆర్ కె సాగర్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!