ఆయుధం న్యూస్ వరంగల్
వరంగల్ మహనగర పరిధిలోని చారిత్రక, పర్యాటక ప్రాధాన్యం కలిగిన రంగనాయక ఉర్సుగుట్ట ప్రాంతాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఉర్సుగుట్ట పరిసర ప్రాంతాల్లో కుడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పర్యాటకులను ఆకర్షించేలా చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ చర్యలు, సందర్శకులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.అనంతరం ఖిలా వరంగల్లు ప్రాంతంలో కొనసాగుతున్న మోటు రిజునవేషన్ అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్నాయా అనే విషయాన్ని పరిశీలించారు. అలాగే రంగ సముద్రం చెరువులో చేపడుతున్న పూడికతీత పనుల పురోగతిని సమీక్షించి, పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.రంగలీల మైదానంలో కొనసాగుతున్న మైదానం చదును అభివృద్ధి పనులను పరిశీలించి నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమన్వయంతో పనిచేస్తూ, వరంగల్ నగరాన్ని పర్యాటక, సాంస్కృతిక, పర్యావరణ పరంగా మరింత అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్లు సూచించారు.ఈ పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొని, ఆయా పనుల పురోగతికి సంబంధించిన వివరాలను కలెక్టర్లకు వివరించారు.
