ePaper
Friday, June 19, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండఆర్థిక సాధికారతకు శిక్షణలే బలమైన పునాది

ఆర్థిక సాధికారతకు శిక్షణలే బలమైన పునాది

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హనుమకొండ
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మహిళలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీలు) తమతో పాటు సమాజ ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సూచించారు.శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని సంస్కృతి విహార్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్‌బీఐ ఆర్‌సెటీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 64 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని (ఫైనాన్షియల్ లిటరసీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్) జిల్లా కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమం నిర్వహణ, లక్ష్యాలు, అందిస్తున్న అంశాలపై వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల సభ్యుల్లో డిజిటల్ లావాదేవీలు, నగదు రహిత చెల్లింపులు, సైబర్ నేరాల నివారణ, బ్యాంకింగ్ సేవల వినియోగం, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల బీమా పథకాలపై సీఆర్పీలకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నట్లు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మరియు ఎస్‌బీఐ ఆర్‌సెటీ ఇన్‌చార్జి డైరెక్టర్ మహేందర్ కలెక్టర్‌కు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామ స్థాయిలో మహిళా సంఘాల సభ్యులకు సమర్థవంతంగా చేరవేసి ఆర్థిక అక్షరాస్యతను మరింత విస్తరించాల్సిన బాధ్యత సీఆర్పీలపై ఉందన్నారు. ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పెరగడం ద్వారా కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.సంస్థలో కుట్టు,బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న 40 మంది మహిళలతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. శిక్షణ ద్వారా పొందుతున్న నైపుణ్యాలను స్వయం ఉపాధి అవకాశాలుగా మలుచుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. మహిళలు ఉపాధి అవకాశాలను సృష్టించుకునే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.అనంతరం సంస్కృతి విహార్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన్ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ మేన శ్రీను, తహశీల్దార్ కిరణ్ కుమార్, డీఈ శ్రీనివాసరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!