కడియం వర్సెస్ కొండా
కడియం సమీక్షపై భగ్గుమన్న మంత్రి సురేఖ
తన పరిధి దాటి వ్యవహరించారని వ్యాఖ్య
సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుపై సీరియస్
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ చిచ్చు రగులుతూనే ఉంది. మంత్రి కొండా సురేఖకు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు అంతర్గత యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మంత్రి కొండా సురేఖకు లేకుండానే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. తన నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై అధికారులతో సమీక్షించడం పట్ల మంత్రి సురేఖ భగ్గుమన్నారు. కడియం శ్రీహరి తన పరిధిని దాటి వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
సమీక్షతో వివాదం
హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడికల్, నవాబ్ పేట, చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, మల్లికుదుర్ల ఆలయాల అభివృద్ధి పై కమిషనర్ హనుమంత రావు తో కలిసి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్లు, ఈఈ, ఈవో లతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆలయాల సమగ్ర అభివృద్ధికి వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. ఇందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. దేవాలయాల భూముల ఆక్రమణలు తొలగించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నెల రోజులలో ఆలయాల అభివృద్ధికి సంబందించిన పూర్తి స్థాయి సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి సురేఖ ఫైర్
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారశైలిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
కడియం శ్రీహరి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, దేవాదాయశాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించడం పై సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలు, మంత్రిగా తన అధికార పరిధిని బేఖాతరు చేశారని మంత్రి సురేఖ లేఖలో పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖ తన ఫిర్యాదు లేఖలో, దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన పరిపాలన, విధాన నిర్ణయాలు, అధికారిక సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ తదితర అంశాలు సంబంధిత శాఖా మంత్రి పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ, శాఖా మంత్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ డైరక్టర్ తో పాటు శాఖ అధికారులను సమావేశపరచి పలు దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, దేవాలయ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, అధికారులకు గడువులు నిర్దేశించడం వంటి అంశాలపై అధికారిక సమీక్ష నిర్వహించడం పరిపాలనా పరంగా అభ్యంతరకరమని, రూల్స్ ఆఫ్ బిజినెస్ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
– కడియంపై చర్యలు తీసుకోండి..
శాఖా పరిపాలనకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు సంబంధిత శాఖా మంత్రి ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంటుందనే విషయం ప్రజా జీవితంలో అనుభవజ్ఞులైన ప్రతి ప్రజాప్రతినిధికి విదితమేనని మంత్రి సురేఖ పేర్కొన్నారు.అలాంటి పరిస్థితుల్లో శాఖా మంత్రిని పూర్తిగా పక్కనపెట్టి అధికారిక సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి దారితీస్తుందని మంత్రి తన లేఖలో స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వంలో పరిపాలనా సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా అధికార యంత్రాంగంలో అయోమయ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి, సంబంధిత అంశాలపై వివరణ కోరడంతో పాటు, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తన ఫిర్యాదులో కోరారు. అంతేకాకుండా కడియం శ్రీహరి వ్యవహార శైలిపై ఇప్పుటికే పార్టి హైకమాండ్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
– దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుపై మంత్రి ఆగ్రహం..
సోమవారం ఆబిడ్స్ లోని ఎండోమెంట్ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో రివ్యూ చేయడం పట్ల ఆ శాఖ కమిషనర్ హనుమంతరావుపై మంత్రి సురేఖ సీరియస్ అయ్యారు. ఫోన్ చేసి గట్టిగా మందలించారు. అంతేకాకుండా కమిషనర్ హనుమంతరావుపై సిఎం రేవంత్ రెడ్డి, సిఎస్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.



