ఆయుధం న్యూస్ హన్మకొండ
సమాజంలోని పేదలు, నిరుపేదలు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారికి ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.బుధవారం సాయంత్రం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో గ్రేటర్ వరంగల్ పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గ లబ్ధిదారుల కోసం ఏర్పాటు చేసిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్నలతో కలిసి లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, సమాజంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తోందని కొనియాడారు.సామాజిక భద్రత ప్రతి ఒక్కరి హక్కు అనే లక్ష్యంతో ప్రభుత్వం చేయూత పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత వృత్తులపై ఆధారపడిన వారికి ఆర్థిక చేయూత అందించడం అభినందనీయమన్నారు. పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, అర్హులైన లబ్ధిదారులకు ఆత్మగౌరవంతో జీవించేందుకు భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు.గ్రేటర్ వరంగల్ పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 2,161 మంది లబ్ధిదారులకు నూతనంగా చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. వీరిలో 1,426 మంది వితంతువులు, 478 మంది దివ్యాంగులు, 139 మంది కల్లుగీత కార్మికులు, 5 మంది చేనేత కార్మికులు, 20 మంది అవివాహిత ఒంటరి మహిళలు, 93 మంది వివాహిత ఒంటరి మహిళలు ఉన్నారు.అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పింఛన్లు మంజూరు చేయడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులకు పింఛన్లు అందించడం అభినందనీయమని, ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఆరు గ్యారంటీ అమలుతో పాటు పేదలకు సన్నబియ్యం, , మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీ నుంచి ప్రతి కుటుంబ పెద్దకు రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయడం పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పా యి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారులకు వివిధ విధాలుగా ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ఈ పథకాల ద్వారా వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ పై గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. అర్హులు సంబంధిత పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెన్షన్ పొందిన లబ్ధిదారులకు ఈ సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాకు మొత్తం 11,750 నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో గ్రేటర్ వరంగల్ పరిధిలోని మూడు వార్డులకు సంబంధించి వర్ధన్నపేట నియోజకవర్గంలో 1,386 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.34 లక్షలు జమ చేసినట్లు, ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్లు అందజేస్తామని తెలిపారు. అధికారుల సమన్వయంతో అన్ని కేటగిరీల అర్హులకు పింఛన్లు అందిస్తున్నామని, అర్హులైన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
