ఆయుధం న్యూస్ హన్మకొండ
జాతీయస్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 అథ్లెటిక్స్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
స్టేడియం గ్యాలరీలకు ఆకర్షణీయమైన రంగులు వేయడంతో పాటు ఖేలో ఇండియా లోగోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్టేడియానికి క్రీడా శోభ తీసుకురావాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు.
ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ జేఎన్ఎస్ స్టేడియాన్ని సందర్శించి జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్యాలరీలకు రంగులు వేయడం, స్టేడియం సుందరీకరణ, ఖేలో ఇండియా లోగో ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కొత్త ప్రశాంత్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
స్టేడియం రూపురేఖలు జాతీయస్థాయి క్రీడా పోటీలకు తగిన విధంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ వెంకన్నను పారిశుద్ధ్యం, పరిసరాల అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
డిసెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జేఎన్ఎస్ స్టేడియంలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు, సాంకేతిక బృందాలు ఈ పోటీలకు హాజరుకానున్నారు.క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత, వసతి, భోజనం, రవాణా వంటి అన్ని సదుపాయాలను పకడ్బందీగా కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్య బృందాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచడంతో పాటు పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.
జీడబ్ల్యూఎంసీ, ఆర్అండ్బీ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, క్రీడా శాఖల సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జాతీయస్థాయి క్రీడాకారులకు ఆకట్టుకునేలా జేఎన్ఎస్ స్టేడియాన్ని తీర్చిదిద్ది, ఖేలో ఇండియా క్రీడలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.ఈ కార్యక్రమం లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు
