ePaper
Friday, November 20, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండపట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించి ఫారం-18 దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ బల్క్‌గా స్వీకరించరాదు

పట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించి ఫారం-18 దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ బల్క్‌గా స్వీకరించరాదు

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా రూపకల్పనను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా చేపట్టాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ తెలిపారు.
బుధవారం న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాల రూపకల్పన పురోగతిపై ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈసీఐ కార్యదర్శి మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించి ఫారం-18 దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ బల్క్‌గా స్వీకరించరాదని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును వ్యక్తిగతంగా పరిశీలించి, దరఖాస్తుదారుల అర్హతలు, సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం– నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియలో ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. అర్హులైన పట్టభద్రులందరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించడంతో పాటు, అనర్హుల పేర్లు నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మొత్తం ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం సుమారు 68 వేల దరఖాస్తులు అందినట్లు తెలిపారు. 2024 సంవత్సరంతో పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఇప్పటికే రెసిడెన్సీయల్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ , ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలను నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టామని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని చెప్పారు. వచ్చిన దరఖాస్తులలో సుమారు 400 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిశీలనకు బీఎల్‌ఓలను నియమించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులన్నింటినీ క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, పరిష్కరించే ప్రక్రియ కొనసాగిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!