ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండపార్లమెంట్ లో మ్యాగీ నూడిల్స్‌లా రెండు మూడు నిమిషాల్లో బిల్లులు పాస్‌ చేస్తున్నారు. వరంగల్ ఎంపీ...

పార్లమెంట్ లో మ్యాగీ నూడిల్స్‌లా రెండు మూడు నిమిషాల్లో బిల్లులు పాస్‌ చేస్తున్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ జ‌న‌గామ‌
దేశంలో కాంగ్రెస్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని వరంగల్‌ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ భూస్థాపితం కావడం ఖాయమని, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జనగామ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ, పట్టణ, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవానికి శనివారం వరంగల్ ఎంపీ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వరంగల్ ఎంపీ.కడియం కావ్య మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ ప్రతి అంశంపై చివరి వరకు పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆయనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.పేద విద్యార్థుల కోసం పోరాడుతున్న నాయకుడు రాహుల్‌గాంధీ అని అన్నారు. పేపర్‌ లీకేజీల వంటి సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతిపక్షాలను, ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

పార్లమెంట్లో మ్యాగీ నూడిల్స్‌లా రెండు మూడు నిమిషాల్లో బిల్లులు పాస్‌ చేస్తున్నారు…..

పార్లమెంట్‌లో కీలకమైన బిల్లులను మ్యాగీ నూడిల్స్‌లా రెండు మూడు నిమిషాల్లోనే ఆమోదిస్తున్నారని కడియం కావ్య విమర్శించారు. బిల్లులపై ఎంపీల అభిప్రాయాలను, ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ తమ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించిన బిల్లులను దేశంపైన, దేశ ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.డీలిమిటేషన్‌ ప్రక్రియను తీసుకురావడం వెనుక బీజేపీ ముందస్తు రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం ఉందని ఎంపీ ఆరోపించారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ఎవరూ ప్రభావితం చేయలేరని అన్నారు. ఎంత పెద్ద పాము అయినా చలిచీమల చేతిలో చనిపోయినట్లే.. ప్రజల చేతిలో బీజేపీ కూలడం ఖాయమని వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్‌కు ఆదరణ క్రమంగా పెరుగుతోందని, రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మరింత మద్దతు ఇవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాయని ఎంపీ ఆరోపించారు. అందువల్ల ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఉందన్నారు. గ్రూపు రాజకీయాలకు తావులేకుండా కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయడమే ప్రతి ఒక్కరి ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందన్నారు..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక అభిమానంతో వరంగల్‌ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సుమారు 6,500 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించి, కాంగ్రెస్‌ పాలనపై విశ్వాసాన్ని మరింత పెంచాలని సూచించారు.

జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ధన్వంతి సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఎంపీ ప్రశంసించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పార్టీ జిల్లా, పట్టణ, మండల, అనుబంధ సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని కోరారు.రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీకి ఒక సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. వ్యక్తిగత విభేదాలు, గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌ జెండా, పార్టీ విజయం కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య సూచించారు.ఈ కార్యక్రమంలో సభా ధ్యక్షురాలు – డిసిసి ప్రెసిడెంట్ లకావత్ ధన్వంతి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాంబాబు, YTDA బోర్డు మెంబర్ లక్ష్మీనారాయణ నాయక్, జనగామ మున్సిపల్ చైర్మన్ బాలమణి, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ వినయ్, స్టేషన్ ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, డిసిసి కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, ట్రెజరర్, అధికార ప్రతినిధులు, కార్యదర్శిలు, ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!