ఆయుధం న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద గురువారం ఖిలా వరంగల్ మండలంలోని ఉరుసు, కరీమాబాద్ ప్రాంతాల్లో ఉన్న పలు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్‌లో సీడీపీఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లల హాజరు, మౌలిక సదుపాయాలపై సమీక్షించిన కలెక్టర్, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు నేరుగా కేంద్రాలను సందర్శించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద నిల్వ ఉంచిన బియ్యం, పప్పు, నూనె, గుడ్లు, బాలామృతం ప్యాకెట్లను స్వయంగా పరిశీలించి స్టాక్ రిజిస్టర్‌తో సరిపోల్చారు.వంటగది, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, పిల్లలు ఆడుకునే ప్రాంగణం, కేంద్రం పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన కలెక్టర్ వారికి పాఠాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఆటపాటల్లో పాల్గొన్నారు.పిల్లలకు అందిస్తున్న భోజనం నాణ్యతపై వారినే ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.చిన్నారులకు ప్రతిరోజూ సుమారు అరగంట పాటు విద్యా సంబంధిత ఆటపాటలు చూపించేలా స్క్రీన్ టైమ్ తగ్గించి మల్టిపుల్ ఆక్టివిటీస్ ను పెంచాలని సీడీపీఓలకు సూచించారు.అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో మాట్లాడిన కలెక్టర్ రోజువారీ భోజన ఏర్పాట్లు, ఆహార పదార్థాల నిల్వ, మెనూ అమలు, పిల్లల హాజరు తదితర అంశాలపై ఆరా తీశారు.అంగన్‌వాడీ కేంద్రాలు, వాటి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, చిన్నారులకు అంటువ్యాధులు సోకకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వంటగది, భోజనం చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలని, నిల్వ ఆహారం కాకుండా ఎప్పటికప్పుడు తాజా, వేడి, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం గుడ్లు, పాలు, కూరగాయలు తప్పనిసరిగా అందించాలని పేర్కొన్నారు.”పిల్లల ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు. అంగన్‌వాడీ సిబ్బంది అమ్మ తర్వాత అమ్మలాంటి బాధ్యతతో పని చేయాలి. మీరు చూపే ప్రేమ, శ్రద్ధ ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది” అని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సూచించారు.తనిఖీల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, సీడీపీఓలు క్రమం తప్పకుండా కేంద్రాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి రాజమణి (డీడబ్ల్యూఓ), సంబంధిత క్లస్టర్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
